
Karthika Maha Puranam Day 1 Parayanam
సంపూర్ణ కార్తీక మహాపురాణము
మొదటి రోజు పారాయణము
శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన
శ్లో|| వాగీశాద్యా స్సుమనస స్సర్వార్థానా ముపక్రమే |
యంనత్వా కృతకృత్యాస్స్యుస్తంనమామి గజాననమ్ ||
శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట:
పూర్వం నైమిశారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి, సంతుష్టుని చేసి, కైవల్యదాయకము అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూతర్షి -“శౌనకాదులారా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని – అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి వున్నారు. ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే, రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోనూ, హేలావిలాస బాలామణియైన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మచే పద్మ పురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున – ప్రతి రోజూ నిత్య పారాయణగా – ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము. ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి’ అంటూ చెప్పసాగాడు.
జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట:
పూర్వమొకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్నా యాగానికవసరమైన ద్రవ్యార్థియైన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి – ‘హే బ్రహ్మర్షీ! మీ యగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాసం అత్యంత మహఇమానహిమాన్వితమైనదనీ, తద్వతాచరణము సమస్తధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదనీ చెబుతూ వుంటారు గదా! ఆ నెలకు అంతటి ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది’ అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు, జ్ఞాన హాసమును చేసతూ, ఇలా ప్రవంచినాడు.
వశిష్ఠ ప్రవచనము
జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనేగాని, సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనదీ, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలనూ అణచి వేసేదీ అయిన – కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో వుంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహా! కార్తీకమాసములో సూర్యుడు తులా సంక్రమణముతో వుండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో, ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని, శుద్ధ పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా
శ్లో || “సర్వపాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ||
ఓ దామోదరా! నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని, కార్తీక స్నానమాచరించాలి. కార్తీకమందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందునా చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడయిన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై, కాళ్లూ చేతులూ కడుగకొని, ఆచమించి,
శుద్ధాత్ముడై మంత్ర యుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో, బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి, మూడు దోసెళ్ల నీళ్లను గట్టుమీకు జిమ్మి, తీరము చేయాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్ష తర్పణమంటారు. అనంతరం ఒళ్లు తుడుచుకుని, పొడివి- మడివి-తెల్లనియైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి, సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి, బ్రహ్మయజ్ఞ మాచరించి, తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారియైన విష్ణువును సాలగ్రామ మందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని, శ్రవణమును గాని ఆచరించినవాడై, స్వగృహాన్ని చేరి, దేవతార్చన, వైశ్వ దేవాదులను చేసి, భోజనమును చేసి, ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి.
Know More Karthika Masam Visistatha
సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలనన్నిటినీ విరమించుకుని –
శివాలయములోగాని, విష్ణ్వాలయములోగాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి, భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి.
ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి.
వర్ణాశ్రమ లింగవయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్లు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా! తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేక పోయినా – ఇతరులు చేస్తుండగా చూసి, అసూయారహితుడై ఆనందించే వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి.
….
….